2 యోహాను 1వ అధ్యాయము

అధ్యాయములు:

1

1పెద్దైనెన నేను, ఏర్పరచబడినదైన అమ్మగారికిని, ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది.
2నేనును, నేను మాత్రమే గాక సత్యము ఎరిగినవారందరును, మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడుఉండు సత్యమునుబట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము.
3సత్యప్రేమలు మనయందుండగా తండ్రియైన దేవుని యొద్దనుండియు, తండ్రియొక్క కుమారుడగు యేసుక్రీస్తునొద్దనుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును.
4తండ్రివలన మనము ఆజ్ఞను పొందినప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను.
5కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదటనుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచు, మనము ఒకరి నొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను.
6మనమాయన ఆజ్ఞలప్రకారము నడుచుటయే ప్రేమ; మీరు మొదటనుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.
7యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు.
8అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై యున్నాడు. మేము మీమధ్యను నెర వేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
9క్రీస్తుబోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు.
10ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.
11శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.
12అనేక సంగతులు మీకు వ్రాయవలసియుండియు సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సులేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలిసికొని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను.
13ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు.